ఆంధ్రప్రదేశ్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోపే మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై శుక్రవారం నాడు సీఐ దేవేంద్రకుమార్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. తాడిపత్రి రూరల్ పరిధిలోని బొందలదిన్నె వద్ద కడప నుంచి వస్తున్న ప్రభాకర్‌రెడ్డి వాహనాలను సీఐ దేవేంద్రకుమార్ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి కొద్ది రోజుల కిందట అరెస్టయిన సంగతి తెలిసిందే. కండీషన్ బెయిల్‌పై వారిద్దరూ గురువారం కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈక్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి వరకు అనుచరగణంతో ర్యాలీగా వచ్చారు. సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీంతోపాటు కడప నుంచి తాడిపత్రి వరకు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా జేసీపై పోలీసులు కేసులు నమోదు చేశారు.500 మందితో జేసీ ఊరేగింపు జరిపారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా కాల్చారు. వీడియో క్లిప్పింగ్స్, ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఐదు కేసులు నమోదు చేశాం’అని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు.
నిజాయతీగా పనిచేస్తున్న పోలీసులపై దాడి చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని, చట్టపరంగా తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. జేసీ అరెస్ట్ సందర్భంగా తాడిపత్రిలో 144 సెక్షన్ విధించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
మరిన్ని వార్తలు