ఆంధ్రప్రదేశ్ : ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి తొమ్మిది మంది మృతిచెందారు. నిన్న అర్ధరాత్రి ముగ్గరు మరణించగా, శుక్రవారం మరో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు భిక్షాటన చేసే వ్యక్తులు కాగా, మరో ఆరుగురు గ్రామస్తులు ఉన్నారు. కరోనా దృష్ట్యా కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దుకాణాలు లేకపోవటంతో కొందరు స్థానికులు, యాచకులు శానిటైజర్ తాగారు. మద్యం దొరకక కొంతకాలంగా వీరు శానిటైజర్ తాగుతున్నట్లు సమాచారం. మృతదేహాలను దర్శి మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కురిచేడులో 10 మంది మృతి పట్ల
టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కురిచేడు దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి. వైసీపీ ప్రభుత్వం మద్యం మాఫియా అరాచకాలపై కఠిన చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో ఇటీవల ఈ విధమైన దుర్ఘటనలు పదేపదే చోటుచేసుకోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలి.
రాష్ట్రంలో గత 14 నెలలుగా కల్తీ మద్యం దుర్ఘటనలు పేట్రేగడం బాధాకరం. నాటు సారా తాగి, కల్తీ మద్యం సేవించి, శానిటైజర్లు తాగి పలువురు చనిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. రాష్ట్రంలో మద్యం ధరలు 300%పైగా పెంచేశారు. నాసిరకం బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యం సర్వనాశనం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా పెరిగిపోయింది. గడ్డివాముల్లో, మొక్కజొన్న మోపుల్లో, లారీల్లో ఎక్కడ చూసినా అక్రమ మద్యం నిల్వలే.. వైసీపీ కార్యకర్తలే మొబైల్ బెల్ట్ షాపులుగా మారారంటూ ఆయన ఆరోపించారు.
మరిన్ని వార్తలు చదవండి.