Heavy Rains to AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన
Heavy Rains Expected to Andhra Pradesh for Next 3 Days: ఏపీకి వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కాగా అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, ఎన్టీఆర్, కృష్ణా, కోనసీమ, తూర్పుగోదావరి, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఇక భారీవర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు వరదనీటితో మునిగిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు రేపు ఏపీని తాకనున్నాయి. మరో 24 గంటల్లో రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దీంతో రేపటి నుంచి మరింత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రుతుపవనాల రాకతో అన్నదాతల వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు.