న్యూఢిల్లీ : ప్రధాని
నరేంద్ర మోదీ ఆదివారం రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని కూడా ప్రారంభించనున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రి నరేంద్ర తోమర్తోపాటు లక్షలాది మంది రైతుల ఆన్లైన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుందని పేర్కొంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పంట దిగుబడులను కాపాడుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.
సామాజిక స్థాయిలో శీతలీకరణ గిడ్డంగులు, ఆహార శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారని వీటితో రైతుల ఉత్పత్తులకు మెరుగైన విలువ లభిస్తుందని, వృథా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రూ.లక్ష కోట్ల నిధిని రైతులకు చేర్చేందుకు ఇప్పటికే దేశంలోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పథకంలో భాగంగా అందించే రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ క్రెడిట్ గ్యారంటీ లభించనుంది.
2018 డిసెంబర్ ఒకటవ తేదీన ప్రారంభమైన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు నేరుగా నగదు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటివరకూ 9.9 కోట్ల మంది రైతులకు సుమారు రూ.75 వేల కోట్లు పంపిణీ చేశామని పేర్కొంది. కోవిడ్–19 కష్ట కాలంలోనూ రైతులను ఆదుకునేందుకు రూ.22 వేల కోట్లు విడుదల చేశామని తెలిపింది. తాజాగా 8.5 కోట్ల మంది రైతులకు రూ.17 వేల కోట్ల పంపిణీ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
మరిన్ని వార్తలు చదవండి.