మాస్కులు ఉచితం గా ఇవ్వండి..!

post

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యం లో ఒక్కసారిగా మాస్కుల కొరత ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రము లో ఒక కరోనా పాజిటివ్ కేసు రావడం తో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనితో స్వీయ రక్షణ కోసం పరుగులు పెడుతున్నారు. ఈ నేపధ్యం లోనే మాస్కులకు, ఆల్కహాల్ శానిటైజర్ల కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. చైనా లో పరిస్థితి ఘోరం గా ఉండటం తో అక్కడి మార్కెట్లు మూతపడ్డాయి. దీనితో భారతీయ మార్కెట్లు ఉత్పత్తిని పెంచినప్పటికీ చాలినంతగా దొరకడం లేదు. ఈ పరిస్థితిల్లో మెడికల్ షాపు వ్యాపారాలు ఒక్కసారిగా మాస్కుల రేటు ని పెంచేశారు. రూ.2 లకు లభ్యమయ్యే మాస్కులను పదిహేను, ఇరవై రూపాయల వరకు పెంచేశారు. అలాగే, 150 రూపాయల మాస్కులను 200 , 300 రూపాయల రేటు కు అమ్ముతున్నారు. ఆల్కహాల్ శానిటైజెర్ల రేటు ను కూడా ఒక్కసారి గా పెంచేశారని వినియోగదారులు వాపోతున్నారు.

         ఈ నేపధ్యం లో, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిద్దలక్ష్మి అనే ఓ మహిళా దాఖలు చేసిన పిల్ పై నిన్నటి రోజున రెండో విచారణ జరిగింది. ఈ విచారణ ముగిసిన తరువాత, మురికి వాడల్లో ఉండే పేదలకు మాస్కులు, శానిటైజర్లను రేషన్ కార్డు షాపుల ద్వారా ఉచితం గా ఇవ్వాలని సూచించింది. ఈ ప్రాంతాల్లో వైరస్ త్వరితగతిన వ్యాప్తి చెందే అవకాశం ఉండటం తో వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తం గా స్క్రీనింగ్ సెంటర్లు...!

కరోనా వైరస్ వ్యాప్తిని గుర్తించడానికి రాష్ట్రవ్యాప్తం గా బస్టాండ్ల లోను, రైల్వే స్టేషన్ల లోను స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలనీ హైకోర్టు ఆదేశించింది. ఇంకా, ఈ విచారణ లో ప్రభుత్వం తరపున ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ కరోనా వైరస్ ను నిర్ములించడానికి తీసుకున్న చర్యల గురించి హైకోర్టు జడ్జి కి వివరించారు. ఛాతీ, గాంధీ, ఫీవర్, టిబి హాస్పిటల్స్ లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.