కరోనా ముప్పును కనిపెట్టేందుకు అపోలో కొత్త స్కానర్..!

post

దేశం లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలంతా కరోనా జపం చేస్తున్నారు. కళ్ళముందున్న విపత్తును ఎదుర్కొనే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నాలు సాగిస్తాయి. రాష్ట్రాలన్నీ స్వచ్చందం గా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. సరిహద్దు లు మూసుకుపోయాయి. ఎవరికి, ఎటువైపు నుంచి కరోనా వైరస్ వచ్చి దాడి చేస్తుందో అర్ధం కానీ పరిస్థితి. అందుకే, ఈ పరిస్థితిని కొంతమేర ఓ అంచనాకి తీసుకు వచ్చేందుకు అపోలో కొత్త ప్రయత్నం చేసింది. దీనినే, 'కరోనా వైరస్ రిస్క్ స్కాన్' అని అంటారు. ఏ వ్యక్తికీ అయినా కరోనా వైరస్ సోకె ఛాన్స్ ఎంతమేర ఉంటుందో, ఈ స్కానర్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది.
     ఓ వ్యక్తికీ ఉన్న లక్షణాల ద్వారా ఈ స్కానర్ అంచనా వేసి అతనికి కరోనా సోకె ఛాన్స్ ఎంతమేర ఉందొ ఈ స్కానర్ చెప్పేస్తుంది. కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించి ఈ స్కానర్ ను తయారు చేసారు. ఈ స్కానర్ ఓ ఎనిమిది ప్రశ్నలను సంధిస్తుంది. వాటికి, ముప్పు గురించి తెలుసుకోవాలనుకునే వ్యక్తి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వయసు, లింగం, జలుబు, గొంతునొప్పి, పొడిదగ్గు, ప్రస్తుత శరీర ఉష్ణోగ్రత, ప్రయాణ చరిత్ర, డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ వ్యాధుల వంటి వాటి గురించి, గతం లో వచ్చిన అనారోగ్య సమస్యల గురించి ఆ వ్యక్తి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాధానాలను స్కానర్ విశ్లేషిస్తుంది.  వీటి ద్వారా, ఎంతవరకు కరోనా వైరస్ సోకె అవకాశం ఉంటుందో స్కానర్ తెలియచేస్తుంది. 
     వ్యక్తులకు కరోనా వైరస్ సోకె ఛాన్స్ ను బట్టి ఈ స్కానర్ లో మూడు తరహా రేంజ్ లను నిర్ణయించారు. అవి హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్ గా విభజించారు. స్కానర్ 'హై రిస్క్' అని సూచిస్తే, అతను ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అతనికి కరోనా వైరస్ సోకె అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అర్ధం.'మీడియం రిస్క్' అని సూచించిన వ్యక్తి కి కూడా కొంత మేర వైరస్ సోకె అవకాశాలు ఉంటాయి. అయితే, 'లో రిస్క్' అని పేర్కొన్న వ్యక్తి సేఫ్ జోన్ లో ఉన్నాడని అర్ధం. డాక్టర్లను సంప్రదించాలి లేదో కూడా స్కానర్ చెప్పేస్తుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వాలతో ఈ స్కానర్ రూపొందించబడినది.