'లోకల్' సమరం లో బీజేపీ, జనసేన ల ఉమ్మడి పోరాటం..!

post

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నగారా మోగింది. స్థానిక పార్టీలు ఎన్నికలలో విజయం సాధించడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. కాగా, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీ మరియు జనసేన పార్టీ లు కలిసి పోరాటం సాగించనున్నాయి. ప్రధాన ఎన్నికలు ముగిసిన తరువాత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కలిసి పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా, పొత్తులో భాగం గానే, రాబోయే స్థానిక ఎన్నికలలో ఈ రెండు పార్టీ లు కలిసి పోరాటం చేయనున్నాయి. ఈ మేరకు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అధికారికం గా ప్రకటించారు.

      ఎపి లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్న నేపధ్యం లో, బీజేపీ పార్టీ మరియు జనసేన పార్టీ నేతలు గురువారం విజయవాడ లో సమావేశం అయ్యారు. ఈ సభ లో స్థానిక ఎన్నికలకు విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసారు. ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం చేస్తున్న రౌడీ రాజకీయాలకి ముకుతాడు వేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. స్థానిక ఎన్నికల కోసం నామినేషన్లు వేయడానికి వచ్చిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై వైసిపి కార్యకర్తలు దౌర్జన్యానికి దిగడం దారుణమని ఆయన అన్నారు. వాళ్లెన్ని బెదిరింపులకు దిగినా, పట్టు వదలక, తట్టుకుని పోటీలో నిలబడాలని ఆయన కార్యకర్తలకు, పార్టీ నేతలకు సూచించారు. యువత కు అవకాశం కల్పించాలన్న సదుద్దేశం తోనే బీజేపీ పార్టీ తో కలిసి ఉమ్మడి గా పోరాడుతున్నానని ఆయన తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులను కూడా నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని వైసీపీ కార్యకర్తలపై మండిపడ్డారు. కాగా, ఆ ఘటనల తాలూకు ఫోటోలను, వీడియోలు, ఇతర ఆధారాలను తాము డీజీపీ కి అందచేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు.

    ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ, పోలీసులు కూడా అధికార పార్టీ కె సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఉపయోగం లేకపోయిందన్నారు. స్థానిక ఎన్నికలను కూడా ఏకగ్రీవం చేసుకోవాలన్న దురుద్దేశం వల్ల, వైసీపీ కార్యకర్తలు ఇటువంటి దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. రాయలసీమ జిల్లాలో ఐతే, బీజేపీ కార్యకర్తలను, వైసీపీ వర్గాలు ఏకం గా రాళ్లతో కొట్టాయని అన్నారు.