కరోనా బాధితులకు వైసీపీ ఎంపీ ల సాయం..!

post

ఊహించని విధంగా కరోనా ముప్పు ముంచుకొచ్చింది. ఇటలీ, అమెరికాలో చావు డప్పు మోగిస్తోంది. సరైన సమయం లో జాగ్రత్తను పాటించడం కోసమే ప్రధాని రాష్ట్రాల్లో కఠినం గా లాక్ డౌన్ అమలు చేయాలని ఆదేశించారు. ఐతే, దీనివల్ల ఉద్యోగస్తుల మాటెలాఉన్నా రోజుకూలీలకు, కార్మికులకు గడ్డు కాలమని చెప్పాలి. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు  ఆహారం లేక రోడ్డున పడ్డాయి. ఐతే, వీరిని ఆదుకుంటామని ప్రభుత్వాలు కూడా ముందుకొస్తున్నాయి. కాగా, వీరి కోసం ఇప్పటికే పలు సెలెబ్రిటీలు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. తాజాగా, ఇద్దరు వైసీపీ ఎంపీ లు కూడా ఈ జాబితాలోకి చేరారు. వీరిద్దరూ తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.
 ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఆ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి  అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఈ ప్రకటన లో ఒక నెల జీతాన్ని ప్రధాని సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి  విరాళంగా ఇస్తామని నేత విజయ సాయి రెడ్డి, లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కరోనా వైరస్ మానవాళి మనుగడకు తీవ్ర సంక్షోభాన్ని సృష్టించిందని అన్నారు. వైరస్ బారిన పడిన వారిని కాపాడుతున్న వైద్య సిబ్బంది మరియు ఇతర అధికారుల సాహసోపేత ప్రయత్నాలు మెచ్చుకోదగ్గవని అన్నారు. 
   ఓ వైపు కరోనా వైరస్ ముప్పు ముంచుకొస్తున్న తరుణం లో అందరు ఇంటి పట్టునే ఉండడం అత్యావశ్యకమని లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి , వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. జనాలు గుంపులుగా గుమిగూడొద్దని సూచించారు. పనిచేస్తే కానీ తిండి దొరకని వారికి అన్ని రకాల సహాయం అందించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. పేదవారికి సాయం చేసేందుకే ప్రధాని సహాయనిధికి, ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించినట్లు తెలిపారు.