రాజ్యసభ ఎన్నికలు వాయిదా..!

post

కరోనా ముంపు ప్రపంచ వ్యాప్తం గా  అల్లకల్లోలాలు సృష్టిస్తోంది. భారత్ లోకి కూడా ఎంటర్ అయ్యి రెండు వారాలు పూర్తి అయ్యాయి. ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా ఈ వైరస్  కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. దీనితో అన్ని పనులు, కార్యక్రమాలు, మీటింగ్లు, షూటింగ్లు, బంద్ అయ్యి, రాష్ట్రాలకు రాష్ట్రాలు లాక్ డౌన్ అయిపోయాయి. దీనితో ఈ నెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు కూడా వాయిదావేయబడ్డాయి. రాజకీయాలు కూడా సద్దుమణిగాయి. అందరు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నెల 31 వ తేదీ తరువాత పరిస్థితి సమీక్షించి ఎన్నికలు జరిపించడానికి సరి అయిన తేదీని నిర్ణయిస్తామని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. " దేశం లో పబ్లిక్ ఎమర్జెన్సీ పరిస్థితి ఇంకా నెలకొని ఉందని, ఈ సమయం లో ప్రజలు పెద్ద ఎత్తున ఒక చోట గుమికూడటం నిషేధమని, అది ప్రజాప్రతినిధులైనా సరే నిబంధనలకు విరుద్ధమని, ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తున్నాం అని'  ఒక అధికారిక ప్రకటన విడుదల చేసారు. 
       ఎన్నికల సందర్భం గా ఏజంట్లు, రాజకీయ పార్టీల ప్రముఖులు, పోలింగ్ అధికారులు, సహాయక అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఒక చోట గుమి కూడాల్సి వస్తుందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో ఇది అంత మంచిది కాదని అభిప్రాయపడింది. ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే అందరు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అభిప్రాయపడింది. లాక్ డౌన్ అమలు లో ఉందన్న ఈసీ, ఎన్నికలకు ఇది అనువైన సమయం కాదని, నిబంధనలకు విరుద్ధమని చెప్పుకొచ్చింది. రాజ్యసభకు ఖాళీ అయిన 55 సీట్లలో, ఏకగ్రీవాలు అయిన 37 మినహా మిగతా 18 స్థానాలకు ఎన్నికలు  నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లో నాలుగు స్థానాల చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో మూడేసి స్థానాల చొప్పున, మణిపూర్ లో రెండు, మేఘాలయ రాష్ట్రము లో ఒక స్థానం చొప్పున ప్రస్తుతం ఖాళీలు ఉన్నాయి. వీటికోసం జరగాల్సిన ఎన్నికలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి.