సైకిల్ దిగుతున్నారు...!

post

 డొక్కా మాణిక్య వరప్రసాద్ , రామసుబ్బారెడ్డి, కరణం బలరాం ...టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరూ సైకిల్ దిగిపోతున్నారు..  ఈ నెలలో అన్ని స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదే మంచి సమయం అనుకుంటున్న నేతలు అధికార పార్టీకి జంప్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్ ఇస్తూ కీలక నేత,మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆపార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం ఉదయం కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాజీనామా పత్రాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపుతున్నట్టు ప్రకటించారు.  గుర్తింపు లేని చోట ఉండాల్సిన అవసరం లేదని తన అనుచరులతో కేఈ ప్రభాకర్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. టీడీపీలో సీనియర్ నేతగా మంచి పేరున్న ఏపీ మాజీ డిప్యుటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వల్ల తనకు రాజకీయంగా అన్యాయం జరగడంతోనే పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రభాకర్ వ్యాఖ్యానించారని కూడా తెలుస్తోంది.
 
       మరోవైపు ప్రకాశం జిల్లాలో టీడీపీ  కీలక నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి వెళ్తారనే  వార్తలు ప్రచారంలో ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పటికి ఒంగోలు   టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీలోకి వెళ్లడంతో.. శిద్దా రాఘవరావును టీడీపీ తరపున ఎంపీ అభ్యర్ధిగా నిలిపారు. అయితే మళ్లీ మాగుంట ఎంపీగా గెలిచారు. తాజాగా శిద్దా కూడా వైసీపీ గూటికి చేరుతారని ప్రచారం సాగుతోంది. ఆయన ఇప్పటికే తన అనుచరులు, అభిమనులతో సమావేశమై ఒక నిర్ణయానికి సైతం వచ్చినట్టుగా సమాచారం. ఆయన మరో రెండు రోజుల్లో పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ ప్రకాశం జిల్లానుంచి శిద్ధా కూడా పార్టీ మారితే టీడీపీ కుంభస్థలాన్ని కొట్టినట్టే. ప్రకాశం జిల్లాలో శిద్ధా రాఘవరావుకు దర్శి, పొదిలి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. దీంతో ఆయన మరోసారి ఆయన వారితో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరెంతమంది నాయకులు సైకిల్ దిగి ఫ్యాన్ చెంతకు చేరుతారో చూడాలి.