సాగరతీరం.. ఎవరి మెడకు హారం..!

post

ఆసియాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్... సహజసిద్దమైన నౌకాశ్రయం.. శరవేగంగా ఎదుగుతున్న నగరం. ఏపీ కి పరిపాలనా రాజధాని .. ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ ప్రత్యేకతెన్నో వున్నాయి. ఏపీలో ఇపుడు విశాఖ పట్నం కీలక నగరం. అటువంటి విశాఖలో 13 ఏళ్ల తరువాత విశాఖ గ్రేటర్ కార్పోరేషన్ కి ఎన్నికలు జరుగుతున్నాయి. 2019 లో ఏపీలో  రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి బలంగా వీచినా ... విశాఖలో మాత్రం సైకిల్ చక్రం తిరిగింది. దీంతో ఈ కార్పోరేషన్ ను కైవసం చేసుకోవడానికి టీడీపీ, వైసీపీలు  సై అంటే సై అంటున్నాయి.  పరిపాలనా రాజధానిగా విశాఖను ఎంపికచేయడంతో విశాఖ వాసులు తమకు అండగా నిలుస్తారన్నది వైసీపీ అంచనా. అయితే అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి జీవిఎంసి ని గెలుచుకోవాలని టీడీపీ లక్ష్యం. .. . 2014లో జీవీఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైనా...భీమిలి మున్సిపాలిటీ, ఐదు పంచాయతీల విలీనాన్ని సవాల్‌ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో వాయిదా పడ్డాయి. దీనితో ఆరేళ్ల పాటు ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగింది.ఈ క్రమంలో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ జీవిఎంసీ ఎన్నికలను నిర్వహించేలా తీసుకున్న నిర్ణయంతో  రాజకీయ పక్షాల్లో సందడి మొదలైంది. ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖలో పాగా వేయాలన్నది ప్రతీ రాజకీయ పార్టీ కోరికగా ఉంటుంది.అసెంబ్లీ ఎన్నికల్లో  విశాఖ నగరంలో ఎదురయిన ఓటమిని ఇపుడు గెలుపుగా మలచుకోవాలని   వైసీపీ ఆరాటపడుతోంది.  విశాఖ నగరంలో  టిడిపికి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల గెలుపుని మరలా రిపీట్ చేయాలని టీడీపీ భావిస్తోంది.
 
గెలుపుకోసం కాదు.. ఉనికి కోసమే..
జనసేన, బీజేపీ రెండు పార్టీలు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నాయి. సామాజిక హితం కోసం రెండు పార్టీలు కలసికట్టుగా బరిలోకి దిగుతున్నామని ఇరు పార్టీలు ప్రకటించాయి. ఏపీలో రాజకీయాలు ధనార్జనే ధ్యేయంగా కొనసాగుతున్న తరుణంలో వీటిని ప్రక్షాళన చేసేందుకు పొత్తు పెట్టుకున్నామని జనసేన అంటోంది. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అభివృద్ది స్ధంబించిపోయిందని బిజెపి నాయకులు అన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు బీజేపీ, జనసేన కూటమికి అండగా నిలవాలని కోరారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఉమ్మడి పోటీపై రాష్ట్ర సమన్వయ కమిటీ చర్చలు జరిపిందని చెప్పారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా రెండు పార్టీలు కలసి  బరిలోకి  దిగుతున్నామని బీజేపీ అంటోంది. మరి సాగరతీరంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.