పెట్రోల్ పై రూ. 18 వరకూ పెంచొచ్చు.. చర్చల్లేవ్..బిల్లుని ఆమోదించేసారు..!

post

ఎన్డీయే సర్కారు మొదటినుంచి రాబడిని పెంచే మార్గాలపైనే దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది విడుదల అయిన బడ్జెట్ లోను ఇది ప్రస్ఫూటం గా కనిపించింది. తాజాగా, పెట్రోలు మరియు డీజిల్ ను అత్యవసర పరిస్థితులలో పెంచుకునేవిధం గా చట్టాన్ని సవరణ చేసింది. అయితే, ఎలాంటి  చర్చలు లేకుండా ఈ బిల్లు ఆమోదం పొందడం గమనార్హం. ఇప్పటివరకు పెట్రోల్‌ పై రూ.10, డీజిల్‌ పై రూ. 4 వరకు మాత్రమే ఎక్సైజ్‌ సుంకం పెంచుకునేందుకు మాత్రమే చట్టపరం గా కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఉండేది.ప్రస్తుతం వీటిని కేంద్రప్రభుత్వం సవరించింది. అత్యవసర పరిస్థితిల్లో లీటరు పెట్రోల్ పై రూ. 18 వరకూ, డీజిల్ పై రూ. 12 వరకూ ఎక్సైజ్ సుంకాలను పెంచుకునే విధం గా చట్టాన్ని సవరణ చేసింది. కాగా, ఈ బిల్లు పై ఎలాంటి చర్చను జరుపకుండా స్పీకర్ ఆమోదం ప్రకటించారు. ఈ  సవరణను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు.
    కరోనా వైరస్ మార్కెట్లను మింగేస్తున్న నేపధ్యం లో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ కారణం తో, క్రూడాయిల్ మార్కెట్ కుదేలైపోయింది. చమురు ధరలు కనిష్టానికి పడిపోయాయి. దీనితో, కేంద్ర ఖజానా కు గండి పడింది. ఫలితం గా ఈ నెల 14న పెట్రోల్, డీజిల్ పై రూ. 3 చొప్పున సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా, దాదాపు రూ. 39 వేల కోట్ల అదనపు ఆదాయం కేంద్ర ఖజానాకు సమకూరుతుంది.  మరోవైపు పెట్రో ఉత్పత్తుల ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఎక్సయిజు ధరలను పెంచే అధికారాన్ని తన వద్ద ఉంచుకొనేందుకే ప్రభుత్వం ఈ చట్ట సవరణను చేసినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.