కొవిడ్ 19 ను మహమ్మారిగా ప్రకటించిన డబ్ల్యు హెచ్ వో...!

post

ప్రపంచ ఆరోగ్య సంస్థ  డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ కొవిడ్‌19ను మహమ్మారి ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ మహమ్మారిని తేలికగా తీసుకోవద్దని, . అలా చేస్తే కరోనాపై మన పోరాటాన్ని ముగించినట్లు అవుతుందని పేర్కొన్నారు. దీని విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరి మారదని అధనామ్‌ వెల్లడించారు. ఇప్పటికే కరోనా వైరస్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 4,291 మంది చనిపోగా, లక్ష మందికి పైగా దీని బారిన పడ్డారు. చైనాలో ఈ వైరస్‌ కొద్దిగా తగ్గుముఖం పడుతుండగా, ఇటలీ, ఇరాన్‌లతో సహా పలుదేశాల్లో ఎక్కువగా వుంది..  అమెరికాలో 38 రాష్ట్రాలకు కరోనా వ్యాపించగా  31 మంది  చనిపోయారు. 1015పైగా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 70 కు చేరింది.
భారత్ కీలక నిర్ణయం
 కరోనా (కొవిడ్‌-19) విశ్వరూపం దాలుస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది.  ‘అంటురోగాల చట్టం-1897’లోని సెక్షన్‌-2 నిబంధనల్ని దేశమంతటా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రిత్వశాఖలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను అందరూ విధిగా అనుసరించాల్సి ఉంటుందని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌-10 ప్రకారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఉండే అధికారాలను ఆరోగ్యశాఖ కార్యదర్శికి కూడా  వుండేవిధంగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు, ప్రభుత్వ యంత్రాంగాలను మెరుగ్గా  వుంచేందుకు  ఈ అధికారాలు ఉపయోగపడతాయి.   కరోనా పై  ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి మంత్రుల బృందం (జీవోఎం) కరోనాపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది. చైనా, హాంకాంగ్‌, కొరియా, జపాన్‌, ఇటలీ, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, ఇరాన్‌, మలేసియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీలకు ప్రయాణించి వచ్చినవారు 14 రోజుల పాటు తప్పనిసరిగా తమ ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఈ సమావేశంలో తెలిపారు.