ఏకగ్రీవాలకు నజరానాలు..!

post

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలకు ప్రభుత్వం  నజరానాలు ప్రకటించింది. పోటీ లేకుండా ఎన్నిక నిర్వహించే స్థానాలకు నగదు రూపేణా బహుమతి అందించేందుకు సమాయత్తమైంది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అలాంటి పంచాయతీలకు నజరానాను పెంచుతూ పంచాయతీరాజ్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది.గతంలో 15వేల జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలకు 7 లక్షలు, 15 వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన వాటికి 20 లక్షలు నజరానా ఇచ్చేవారు. తాజాగా ప్రభుత్వం వాటిని సవరించింది.
    2 వేల జనాభాకంటే తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే 5 లక్షలు, 2 నుంచి 5 వేల లోపు జనాభా ఉంటే పది లక్షలు, 5 నుంచి 10 వేల లోపు ఉంటే 15 లక్షలు, 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు 20 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో అధికారులు వివరించారు.ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించటం వల్ల వచ్చే నగదు బహుమతితో స్థానికంగా మౌళిక వసతులు ఏర్పాటు చేసుకోవచ్చని గ్రామాల ప్రజలు ఆలోచిస్తున్నారు. దీంతో ఈ సారి పెద్ద ఎత్తున ఏకగ్రీవ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని కూడా అధికారులు భావిస్తున్నారు.