భారత్ లో తొలి కరోనా మరణం..!

post

భారత్ లో  తొలి కరోనా మరణం నమోదైంది. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 76 ఏండ్ల ఓ వృద్ధుడు మంగళవారం మృతిచెందగా   అతనికి కరోనా సోకినట్టు ఆ రాష్ట్ర అధికారులు గురువారం ధ్రువీకరించారు.  మృతుడు హైదరాబాద్‌లోని  రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో  చికిత్స తీసుకున్నాడని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశామన్నారు.  మరోవైపు, వృద్ధుడు చికిత్స తీసుకున్న దవాఖానల్లోని సిబ్బందిని పర్యవేక్షణలో ఉంచామని, ఇప్పటి వరకూ ఎవ్వరికీ వైరస్‌ సోకినట్టు గుర్తించలేదని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ జి శ్రీనివాసరావు తెలిపారు.  మృతిచెందిన వృద్ధుడితో 43 మంది కాంటాక్ట్‌లో ఉన్నట్టు తేలింది. తొలి కరోనా మరణానికి హెదరాబాద్‌తో సంబంధం ఉన్నట్టు తేలడంతో తెలంగాణ ప్రభుత్వం అన్ని ఆసుపత్రులను  అప్రమత్తం చేసింది.   ఈ  వృద్ధుడు  సౌదీ అరేబియా నుంచి గతనెల 29న దేశానికి వచ్చినట్టు అధికారులు పేర్కొనారు. 
దేశంలో 74 కేసులు..!
భారత్ లో కరోనా వైరస్‌ నిర్ధారిత కేసుల సంఖ్య 74కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకూ ఢిల్లీ-6, ఉత్తర్‌ప్రదేశ్‌-10, కర్ణాటక-4, మహారాష్ట్ర-11, లఢక్‌-3, రాజస్థాన్‌, తెలంగాణ, తమిళనాడు, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదవ్వగా.. కేరళలో ఇప్పటివరకూ 17 కరోనా కేసులు నమోదయ్యాయని ఇందులో ముగ్గురు వ్యక్తులు కోలుకోవడంతో వాళ్లను డిశ్చార్జి చేశామని ఆ శాఖ తెలిపింది.కరోనా వైరస్‌ను అరికట్టే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు కనీసం రెండేండ్ల సమయం పడుతుందని కేంద్రం పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద వైరస్‌లు సాధారణంగా జీవించలేవని అయితే కరోనా విషయంలో ఇది ఇంకా నిర్ధారణ కాలేదని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో  ఇంటివద్ద నుంచే పనిచేయాలని ట్విట్టర్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులను ఆదేశించింది.