కరోనాకు ఆరోగ్యభీమా..!

post

కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించిన వేళ ఇది కొంచెం ఊరట కలిగించే వార్త. ఆరోగ్య భీమా పాలసీలను రూపొందించే సమయంలో  కరోనాను కూడా చేర్చాలనీ.. ఆ వైద్యానికయ్యే ఖర్చును పొందుపరచాలని ఐఆర్‌డీఏ (కేంద్ర బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ)ఆదేశించింది.. ఇందుకు సంబంధించి ఈ నెల 4న సర్క్యులర్‌ జారీ చేసిన ఐఆర్‌డీఏ.. తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించిన కేసులకు తక్షణమే వైద్య బీమా వర్తింపజేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన వారికి వైద్య బీమా పాలసీ ఉంటే ఆరోగ్య బీమా కంపెనీలు తక్షణమే స్పందించాలని ఐఆర్‌డీఏ చెప్పింది. కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు వైద్య ఖర్చులను వారి పాలసీ నిబంధనల ప్రకారం చెల్లించాలని ఆదేశించింది. కరోనా వైరస్‌ కేసులను తిరస్కరించేముందు వాటిని క్షుణ్ణంగా సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.