రాణాకపూర్ కు వేయి కోట్ల భవనాలు..!

post

ఎస్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ కు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో రూ.1000కోట్ల విలువగల విలాసవంతమైన భవనాలున్నాయని తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెల్లడైంది. రాణాకపూర్ భార్య బిందూకపూర్ పేరిట ఈ భవనాలున్నాయని భావిస్తున్న ఈడీ  బిందూకపూర్ జరిపిన రూ.4,300 కోట్ల ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు సాగిస్తోంది.బిందూకపూర్ ఢిల్లీలోని ప్రధాన ప్రాంతమైన అమృత షెర్గిల్ మార్గ్ 40 వద్ద ఒక విలాసవంతమైన బంగ్లోను బ్లిస్ అబోడ్ లిమిటెడ్ పేరిట కొనుగోలు చేశారని సమాచారం. మరో రెండు విలాసవంతమైన భవనాలను కూడా బ్లిస్ విల్లా ప్రైవేటు లిమిటెడ్ పేరిట కొన్నారని తేలింది.   రాణాకపూర్ ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉన్న తన విలాసవంతమైన భవనాలను విక్రయించి, ఆ డబ్బుతో అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాలకు మారాలని వ్యూహం పన్నారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. దేశం విడిచి వెళ్లే ముందు భారతదేశంలో ఎలాంటి ఆస్తులను వదిలివేయకుండా రాణాకపూర్ ప్లాన్ చేసినట్లు  తేలింది.
     ఢిల్లీ అమృత షెర్గిల్ మార్గ్ లో విలాసవంతమైన భవనం విలువ రూ.450 కోట్లని ఢిల్లీ చాణక్యపురిలో భవనం విలువ రూ.350 కోట్లు, సర్దార్ పటేల్ భవనం విలువ రూ.250 కోట్లని ఈడీ లెక్కగట్టింది..ఇవి కాకుండా ముంబైలోని అల్టమౌంట్ రోడ్డులో రాణాకపూర్ కుటుంబం రూ.128 కోట్లకు ఓ భవనాన్ని కొనుగోలు చేసింది. రాణాకపూర్ తోపాటు అతని భార్య, వారి ముగ్గురు కుమార్తెలు రాఖీ కపూర్ టాండన్, రోష్ని కపూర్, రాధా కపూర్ లపై కుంభకోణం కేసులను ఈడీ నమోదు చేసింది.