కరోనా అలెర్ట్..!

post

కరోనా (కొవిడ్‌-19) నియంత్రణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చే వారు వ్యాధి లక్షణాలు లేకున్నా, 14 రోజుల పాటు ఇంటి వద్దే ఉండాలని ఆదేశించింది. ఆ తర్వాత పరీక్షలు చేశాకే వారు బయటకు రావాల్సి ఉంటుంది. ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్‌ సోకినా 14 రోజుల తర్వాతే వ్యాధి లక్షణాలు బయటపడతాయన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమానితుల చికిత్సలోనూ మార్పులు చేస్తున్నారు. విదేశాల నుంచి వ్యాధి లక్షణాలతో వచ్చిన వారిని, ఎలాంటి లక్షణాలు లేని వారిని వేర్వేరు చోట్ల ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు.

కేసులు లేవని తేలిగ్గా తీసుకోవద్దు
రాష్ట్రంలో కేసులు లేవని తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగానే ఉండాలని మంత్రి ఈటల వైద్యాధికారులను కోరారు. ఆయన శనివారం పరిస్థితిని సమీక్షించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో కూడా మాట్లాడారు. గాంధీ ఆసుపత్రిలోని ఏడో అంతస్తులో ఉన్న కరోనా వార్డుల్లోకి ఇతరులను అనుమతించవద్దని సూచించారు. బాధితుల్లో ఐటీ ఉద్యోగులు, ప్రముఖ బాధ్యతలు కలిగిన వారు ఉంటున్నందున వారి పనులకు ఇబ్బంది లేకుండా అవసరమైతే వైఫై సౌకర్యం కల్పించాలని సూచించారు. వైద్యశాఖలోని అన్ని స్థాయుల అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

16 ఔషధ దుకాణాల మూసివేత..!
రాష్ట్రవ్యాప్తంగా శనివారం 16 ఔషధ దుకాణాలపై అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. మాస్క్‌లు, శానిటైజర్లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న 16 దుకాణాలను మూసివేయించారు. చైనా నుంచి వచ్చే 58 రకాల ఔషధాల ధరలపైనా అధికారులు ఆరా తీశారు.
కరోనా అనుమానితులను నేరుగా ఆసుపత్రులకు తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 108 అంబులెన్సులను సిద్ధం చేసింది. పరీక్షల అనంతరం వారిని ఆయా వాహనాల్లోనే ఇళ్లకు తరలించనున్నారు. ప్రత్యేక అంబులెన్సుల్లో సిబ్బందికి అన్ని రకాల రక్షణ సామగ్రి అందించారు. వైద్యులు, సిబ్బంది కోసం ఎన్‌95 మాస్క్‌లు 30 వేలు, ప్రత్యేక దుస్తుల కోసం ఆర్డర్‌ పెట్టారు. వీటిలో  కొన్ని ఆసుపత్రులకు చేరుకున్నాయి. అవసరమైతే 100 పడకల సామర్థ్యం ఉన్న సైనిక ఆసుపత్రిని అప్పగించేందుకు సైనికాధికారులు ముందుకు వచ్చారు. శనివారం వారు మంత్రి ఈటలను కలిసి సుముఖత వ్యక్తం చేశారు. ఛాతీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది.

గాంధీలో మరో హెల్ప్‌డెస్క్‌:
ఐసోలేషన్‌ వార్డులకు రెండు  తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో గాంధీ ఆసుపత్రిలో మరో హెల్ప్‌ డెస్కు ఏర్పాటు చేశారు. ప్రాథమిక లక్షణాలు ఉంటే నమూనాలు తీసుకుని, ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తున్నారు. కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రికి వచ్చిన వారిలో ఇప్పటివరకు 247 మంది నుంచి నమూనాలు సేకరించగా, ఒక్కరిలో మాత్రమే వ్యాధి లక్షణాలు బయట పడ్డాయి. మిగతా వారిలో ఎలాంటి వైరస్‌ లేదని తేలింది. వివిధ లక్షణాలతో శనివారం 32 మంది వైద్యులను సంప్రదించారు. వీరిలో 19 మంది నుంచి నమూనాలు సేకరించగా, అయిదుగురి నమూనాల్లో వైరస్‌ లేదని తేలింది. మరో 14 మంది ఫలితాలు రావాల్సి ఉంది. గాంధీలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడి ఆరోగ్యం శనివారం మరింత మెరుగు పడిందని వైద్యులు తెలిపారు.

అనుమానితులకు చిక్కులు:
అనుమానిత లక్షణాలున్న వారికి తమ నివాసాల వద్ద స్థానికుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంట్లో ఉండవద్దని గొడవ చేస్తున్నారు. వ్యాధి లేదని చెప్పినా, ఆసుపత్రిలో ఇచ్చిన నివేదిక చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో బాధితులు తమ రిపోర్టుల కోసం గాంధీ ఆసుపత్రికి బారులు తీరుతున్నారు.