మీ డబ్బు సేఫ్.. ఆందోళనలో ఎస్ బ్యాంకు ఖాతాదారులు..!

post

ఎస్ బ్యాంకు ప్రస్తుతం నిధుల కొరతను ఎదుర్కుంటోంది. ఈ నేపధ్యం లో భారత రిజర్వ్ బ్యాంకు 'ఎస్ బ్యాంకు (YES ) పై ఆంక్షలు విధించింది. ఎస్ బ్యాంకు ఖాతాదారులు నెలకు యాభై వేలకు మించి విత్ డ్రా చేసుకోరాదని స్పష్టం చేసింది. దీనితో ఆందోళన చెందుతున్న ఖాతా దారులు ఎటిఎం ల వెంట పరిగెత్తుతున్నారు. దీనితో ఎటిఎం లు రద్దీ అయ్యాయి. కాగా, తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ ఆంక్షలు అమలు లో ఉంటాయి అని ఆర్ బి ఐ స్పష్టం చేసింది.

  ఓ వైపు, వారి నిధులను డ్రా చేసుకోవడానికి కొంతమంది ఎటిఎం ల వద్ద క్యూ కడుతుంటే, మరికొంతమంది వారి ఖాతా లోని నగదు ను మరొక ఖాతా లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే, ఈ ప్రయత్నాలేవీ సత్ఫాలితాలను ఇవ్వలేదు. 

కాగా యస్‌ బ్యాంకు గత కొన్ని నెలలుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కొనసాగుతుంది.డిసెంబర్‌ త్రైమాసికంతో ముగిసిన ఆర్ధిక ఫలితాలను ఇప్పటికీ విడుదల చేయలేదు. తీవ్ర మొండి బాకీలను ఎదుర్కొంటుంది. గత కొన్ని నెలలుగా మూలధనం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. బ్యాంక్‌ పరిస్థితి బాగోలేనందున ఏ ఇన్వెస్టర్‌ కూడా పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. ఇది  బ్యాంక్ సంక్షోభానికి అద్దంపడుతోంది చే. యస్‌ బ్యాంకును గట్టెక్కించడానికి ప్రభుత్వ రంగంలోని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)లను కేంద్రం రంగంలోకి దింపిందని తెలుస్తోంది.. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి యస్‌ బ్యాంకుకు మూలధనం అందించనున్నాయని సమాచారం. యస్‌ బ్యాంకుకు రూ.12,000 నుంచి రూ.14,000 కోట్ల మేర నిధులు అందించడానికి ఆర్ధిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బిఐ వద్దకు ప్రతిపాదనలు చేరినట్లు సమాచారం. ఈ మూలధనాన్ని ఈక్విటీలు, కన్వర్టేబుల్‌ డిబెంచర్ల ద్వారా సమకూర్చే అవకాశం ఉంది. దీనికి ఎస్‌బిఐ కన్సోరియం (నాయకత్వం) వహించనుంది. 

దీనికీ మోదీ ప్రభుత్వమే కారణం..!

ఓ పక్క ఆర్ధిక సంక్షోభం లో ఎస్ బ్యాంకు ఉంటె, ఎస్ బ్యాంకు ఆందోళనలకు గురి అవుతుంటే, మరోవైపు కాంగ్రెస్ నేతలు దీనిని రాజకీయం గా మారుస్తున్నారు. నిధుల కొరత ఎస్ బ్యాంకు వైఫల్యం కాదని, భారత ప్రధాని నరేంద్రమోడీ విధానాలే ఆర్ధిక వ్యవస్థను కుదిపేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మరో కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడుతూ, బీజేపీ ఇప్పటికే ఆరేళ్లుగా అధికారం లో ఉందని, పంజాబ్ బ్యాంకు పరిణామాలతో ఇప్పటికే బీజేపీ పరిపాలన లో వైఫల్యాలు బయట పడ్డాయని ఆరోపించారు. 'పూర్తిగా ఆర్థిక వ్యవస్థ వైఫల్యం కనిపిస్తోంది, ఇది ఇక్కడితో ఆగుతుందా? లేదా మరిన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయా? ప్రభుత్వం మాత్రం మౌనం గానే ఉంది. పంజాబ్ బ్యాంకు మాదిరే, ఎస్ బ్యాంకు ఖాతాదారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు' అని చిదంబరం చెప్పుకొచ్చారు.

మీ డబ్బు సేఫ్..!

ఎస్ బ్యాంకు పై ఆర్బీఐ ఆంక్షలు విధించడం తో ఆందోళనకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. విపక్ష పార్టీలు విమర్శలతో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యం లో ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ తో పాటు గా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. డిపాజిటర్ల డబ్బు సేఫ్ గా ఉంటుంది అని నిర్మల సీతారామన్ తెలిపారు. 'ఎస్‌ బ్యాంకు డిపాజిటర్లకు ఎటువంటి నష్టం జరగదని ఆర్‌బీఐ గవర్నర్‌ నాకు స్పష్టం చేశారు' అని అన్నారు. గవర్నర్ శక్తి కాంత దాస్  స్పందిస్తూ ' నెల రోజుల్లో ఎస్ బ్యాంకు పునరుద్ధరణకు పధకాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఎస్‌ బ్యాంకు డిపాజిటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. డిపాజిటర్ల భద్రత కోసమే ఆర్బిఐ ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలిపారు.