ట్రంప్ కు బిల్ గేట్స్ సలహా..!

post

అమెరికా లో కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. అన్ని దేశాలకంటే ఎక్కువగా అమెరికా లో కేసులు  పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండు లక్షల పై చిలుకు కేసులు నమోదు అయ్యాయి. గత నెలరోజులుగా అమెరికా లో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపధ్యం లో, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 'ది వాషింగ్టన్ పోస్ట్' పత్రికలో ఈ అంశంపై తన అభిప్రాయాలను తెలిపారు.
  దేశం లో కరోనా వ్యాప్తి ని అరికట్టడానికి షట్ డౌన్ ఏకైక మార్గమని  ఆయన తెలిపారు. "పెరుగుతున్న మహమ్మారి విషయంలో ఎవరినీ నిందించకుండా, దేశవ్యాప్త షట్ డౌన్ ను అమలు చేయాలి. చాలా చోట్ల, బీచ్ లు తెరిచే ఉన్నాయని, రెస్టారెంట్ లు కూడా ఇంకా నడుస్తున్నాయని అన్నారు. ప్రజలు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతున్నారు, వీరిలానే వైరస్ కూడా వ్యాప్తిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కనీసం పది వారాల షట్ డౌన్ అవసరం" అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, దేశ వ్యాప్తం గా కరోనా కేసులు తగ్గు ముఖం పట్టే వరకు షట్ డౌన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయం లో నిర్ణయం తీసుకోకపోతే తరువాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. 
      అలానే, కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ తీసుకురావడానికి  ఏడాదిన్నర సమయం అవసరమవుతుంది అనుకుంటున్నప్పటికీ, శాస్త్రవేత్తలు దీనిపై త్వర గా కృషి చేయాలనీ, సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.