కిలో పది నుంచి యాభై కు ఎగిరిన టమాటా..!

post

కరోనా వైరస్ విజృంభిస్తున్న  నేపధ్యం లో కూరల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నెల 31 వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో, వినియోగదారులు ఒక్కసారి గా ఎక్కువ కూరగాయలు కొనుగోలు చేసేస్తున్నారు. ఇదే అదను  గా తీసుకుని వ్యాపారస్తులు ఒక్కసారిగా కూరల ధరలను పెంచేశారు. మొన్నటి వరకు కిలో పది రూపాయలు ఉన్న టమాటాల ధర ఒక్కసారిగా కిలో యాభై రూపాయలకు చేరుకుంది ధరల పెంపుదలపై మార్కెట్ అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా ఉపయోగం లేకపోయిందని కొనుగోలు దారులు వాపోతున్నారు. అధికారులు అసలు పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  నిన్న సరూర్ నగర్ లో కూరగాయల మార్కెట్ వద్ద కొనుగోలుదారులకు, వ్యాపారస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. కిరానా సామాన్ల కోసం, కూరగాయల కోసం జనాలు బారులు తీరిన సంగతి తెలిసిందే. ఏ వస్తువులపైనా ధరలు పెంచరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అమ్మకం దారులు ధరలు పెంచడం పట్ల మార్కెటు కు కూరల కోసం వచ్చిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి  వరకు కిలో ఇరవై రూపాయలు ఉన్న పచ్చిమిర్చిని ప్రస్తుతం నూట ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు.బోర్డు ధరలకు సంబంధం లేకుండా ఎక్కువ ధరలకు అమ్మడం తో ప్రజలు విస్తుపోతున్నారు. ఈ విషయం పై ప్రభుత్వం కల్పించుకుని ధరలు తగ్గించాలని వారు కోరుతున్నారు.