ముంబై, పూనే లాక్ డౌన్..!

post

ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడి ముంబైలో ఒకరు చనిపోయారు కూడా. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో.. మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై, పుణే, నాగపూర్ నగరాల్లో ఆఫీసులు, దుకాణాలను మూసివేయాలని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. మహా సర్కారు నిర్ణయంతో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం, పుణే, నాగపూర్, పింప్రీ-చించ్‌వాడ్ ప్రాంతాలు లాక్ డౌన్ అవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నిర్ణయం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది.అత్యవసర సేవలకు సంబంధించిన కార్యాలయాలు మాత్రమే తెరిచి ఉంటాయని మహా సర్కారు వెల్లడించింది. కాగా బస్సులు, లోకల్ రైళ్ల రాకపోకలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. చివరి చర్యగా మాత్రమే ప్రజారవాణాను నిలిపేస్తామని ప్రకటించింది. ఆఫీసులు, షాప్‌ల మూసివేత వల్ల చాలా ఉపాధి కోల్పోయే అవకాశం ఉండటంతో... దీనిపై మరోసారి తగిన విధానాలను ప్రకటిస్తామని తెలిపింది.

కరోనా వైరస్ ప్రభావంతో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పరీక్షలను కూడా మహారాష్ట్ర సర్కారు రద్దు చేసింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులు పై తరగతికి ప్రమోట్ అవుతారని స్పష్టం చేసింది. కరోనా సామూహిక వ్యాప్తి చెందకుండా అరికట్టడం కోసమే మహారాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.