నిర్బయ నిందితుల ఉరి..!

post

ఎట్టకేలకు నిర్బయ కేసు కధ ముగిసింది. ఎనిమిదేళ్ల కిందట దేశ రాజధాని లో యువతి పై అత్చాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను నేడు ఉరితీసారు.ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చివరి క్షణం వరకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.  చట్టంలో వున్న లొసుగులను అన్నింటినీ ఉపయోగించుకున్నారు. పదే పదే క్షమాబిక్ష పిటీషన్లు దాఖలు చేసారు. అయితే వారు దాఖలు చేసిన పిటిషన్లంటినీ న్యాయస్థానాలు కొట్టివేశాయి. దీంతో దోషులైన ముకేశ్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్త (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31)లను  ఈ రోజు ఉదయం 5.30 గంటలకు తిహార్‌ జైలులో  తలారి పవన్‌ జల్లాద్‌ ఉరి తీశారు. పలువురు జైలు అధికారులతోపాటు,  నిర్భయ దోషుల ఉరితీతను వైద్యులు ధ్రువీకరించారు. నలుగురూ మరణించినట్లు వెల్లడించారు. 
 చివరి వరకూ...
  నేరం జరిగినప్పుడు తాను దిల్లీలో లేనంటూ దోషి ముకేశ్‌ సింగ్‌ చేసిన వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. చట్టపరమైన అన్ని అవకాశాలు మూసుకుపోయాయని, ఈ దశలో కొత్త వాదనలకు అవకాశం లేదని జస్టిస్‌ ఆర్‌.భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తాను సమర్పించిన రెండో క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఇంకో దోషి అక్షయ్‌ కుమార్‌ పెట్టుకున్న దరఖాస్తును కూడా ఇదే ధర్మాసనం తిరస్కరించింది. మరో నిందితుడు పవన్‌ కుమార్‌ పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటిషన్‌ను జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం తిరస్కరించింది. దీనిపై మరలా హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినప్పటికీ వారికి నిరాశే ఎదురయింది. ఉరిని తప్పించుకోలేకపోయారు.నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరి తీసిన తర్వాత తిహార్ జైలు వద్ద జనం వేడుకలు జరుపుకున్నారు. ‘నిర్భయ జిందాబాద్’  ‘‘న్యాయవ్యవస్థకు ధన్యావాదాలు’’ అంటూ పోస్టర్లు, త్రివర్ణ పతాకాలతోనినాదాలు చేశారు.
న్యాయం జరిగింది...!
 తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించినందుకు న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి ఆశాదేవి కృతజ్ఞతలు తెలిపారు.నిర్భయ కేసు తీర్పు మహిళలు సాధించిన విజయమని, తన కుమార్తెకు న్యాయం జరిగిందని బాధితురాలి తండ్రి బద్రీనాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.  ‘‘ దోషులను ఉరి తీయడానికి సమయం పట్టి ఉండవచ్చు, కానీ చివరికి న్యాయం జరిగింది’’ అని ఆశాదేవి చెప్పారు.
లాయర్ ప్రేలాపన..!
లాయర్ ఏపీ సింగ్ నిర్భయ తల్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  నిర్భయ తల్లిని ప్రస్తావిస్తూ.. తన కూతురు ఎక్కడుందో.. రాత్రి 12 గంటల వరకు ఎవరితో ఉందో తెలియదని.. తప్పు ఆమెది.. ఆమెనుశిక్షించాలన్నాడు. ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ నలుగురితో పాటూ లాయర్‌ను కూడా ఉరి తీస్తే బావుండేది అంటున్నారు. కొందరు వీడేం మనిషి.. చట్టాల్లో లొసుగులతో ఏడేళ్ల పాటూ కోర్టుల్లో కేసును నాన్చారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలించిందన్నారు. ఇది నిర్భయకు అసలైన నివాళి అంటున్నారు.