కరోనా నివారణ చర్యలు తీసుకోండి..!

post

శ్రీశైలంలో ఉగాది వేడుకల సందర్భంగా కరోనా వైరస్‌ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శ్రీశైలంలో ఉగాది వేడుకల కు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కర్నూల్ కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. .  ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా కర్ణాటకలోని  బెల్గాం, బీజాపూర్‌, బాగల్కోట్‌, రాయచూర్‌, గుల్బర్గా, బీదర్‌, యాదగిరి, ధార్వడ్‌, బళ్ళారి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి   కరోనా నేపధ్యంలో తగు చర్యలు తీసుకోవాలని  ఈ జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశామని తెలిపారు.  అలాగే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌ నగర్‌, గద్వాల్‌, నాగర్‌ కర్నూలు, వనపర్తి, నల్గొండ జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని వారికి కూడా వైరస్‌ సోకకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆ  జిల్లాల కలెక్టర్లను కోరామన్నారు. ఈ నెల 17 నుంచి  మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం నిలుపుదల చేశామని, కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు.
మల్లికార్జున స్వామి వారికి నిర్వహించే ఆర్జిత సామూహిక, గర్భాలయ, అభిషేకం, భ్రమరాంబాదేవికి నిర్వహించే ఆర్జిత కుంకుమార్చన సేవలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కూడా రద్దు చేశామన్నారు.  గ్రామోత్సవాలు, ప్రభోత్సవం, వీరాచరణ విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం, హోమాలు, జపాలు, అనుష్టానాలలో భక్తుల భాగస్వామ్యాన్ని తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. నిత్య కళారాధన  వేదికపై నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా రద్దు చేశామని  తెలిపారు.