ఆర్బీఐ కీలక నిర్ణయం...!

post

 కోవిడ్‌-19  జృంభణతో ప్రపంచ ఆర్థికవృద్ధి కుదేలవుతోంది..  దీంతో ఆయా దేశాల  కేంద్ర బ్యాంకులు కీలక చర్యలకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో  రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కూడా ఈ పరిస్థితిని ఎదుర్కోవ డానికి చర్యలు చేపట్టింది.  ఓయంవో (ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌)ద్వారా  పది వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుంది.  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి, రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య టేనర్‌తో మొత్తం రూ.10,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలును మార్చి 20న ప్రారంభిస్తామని ఆర్‌బిఐ తెలిపింది. అన్ని మార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడటం చాలా ముఖ్యమని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌బీఐ బాండ్ కొనుగోలు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనేబెంచ్‌మార్క్ పదేళ్ల బాండ్ దిగుబడి 6.24 శాతానికి పడిపోయింది. మరోవైపు తాజా  నిర్ణయంతో ఆర్‌బీఐ 125 పాయింట్లమేర కీలక వడ్డీరేట్ల కోత పెట్టనుందన్న అంచనాలకు మరింత బలాన్నిస్తోంది. కోవిడ్ తో  ఆయా సెంట్రల్ బ్యాంకులన్నీ రేట్ల కోతకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా యూఎస్ ఫెడ్  భారీగా రికార్డు స్థాయిలో రేట్ల కోతకు నిర్ణయించింది. ఇదే బాటలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్ కూడా రేట్ల కోతకు దిగాయి.