రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు...!

post

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా గురువారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యం లో రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, పరీక్షలకు విద్యార్థులు ఆత్మవిశ్వాసం తో హాజరు కావాలని సూచించారు. ఆందోళన చెందకుండా, పరీక్షలు ప్రశాంతం గా పూర్తి చేయమని చెప్పారు. పరీక్షల నిర్వహణ నిమిత్తమై, ఆమె మంగళవారం విద్యా శాఖ ఉన్నత అధికారులతో చర్చించారు. పదోతరగతి పరీక్షలకు రాష్ట్రంలో 5,34,903 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. వీరిలో బాలురు 2,73,971, బాలికలు 2,60,932 మంది ఉన్నారని చెప్పారు.  పరీక్షలకు 5,09,079 రెగ్యులర్‌, 25,824 ప్రైవేటు విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు.  కాగా, పరీక్షల కోసం 2,530 పరిక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. పరీక్షా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభం అవుతుందని, అయితే విద్యార్థులు మాత్రం ఎనిమిదిన్నర గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆమె తెలిపారు. పరీక్షల సమయం ఏర్పడ్డ ఇబ్బందులు పరిషరించడానికి, ప్రభుత్వ పరీక్షా కార్యాలయం, డీఈవో కార్యాలయం ఇరవై నాలుగు గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ ను (040-23230942) ఏర్పాటు చేశామని ఆమె చెప్పుకొచ్చారు.

    పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని ఆమె చెప్పుకొచ్చారు. విద్యార్థుల్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటివి ఉంటె, వారిని ప్రత్యేకం గా కూర్చోబెట్టడానికి గదులు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద గుంపులు ఏర్పడకుండా, ప్రతిరోజూ ఎనిమిదిన్నరకే పరీక్ష గదిలోకి అనుమతిస్తామని ఆమె చెప్పారు.

విద్యార్థులూ... ఇవి పాటించండి.

ఆల్ ది బెస్ట్ లు, బెస్ట్ అఫ్ లక్ లు చెప్పుకోవడానికి కరచాలనాలు చేయకండి. జనం ఎక్కువ గా ఉన్న ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్క్ కట్టుకోండి. పరీక్షలకు సంబంధించి, లేదా ఇతర అంశాలకు సంబంధించి బృంద చర్చలకు తెరలేపకండి. ముఖం కప్పుకోవడానికి, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు టిష్యూ లను వాడితే, వాటిని ఎక్కడపడితే అక్కడ పడేస్తే వైరస్ వ్యాపిస్తుంది. అందుకని చెత్త బుట్టలలో మాత్రమే పడవేయండి. ఒత్తిడి కి గురై, తరచూ చేతులను ముఖానికి రాసుకోవద్దు. చేతులు శుభ్రం చేసుకోకుండా, ఎలాంటి ఆహార పదార్ధాలను తినకండి. పరీక్ష కేంద్రాలకు మీ తల్లి తండ్రుల వాహనాలపై వెళ్లడం ఉత్తమమైన మార్గం.