తగ్గిన సిమెంట్ ధర..!

post

ఏపీలో సిమెంట్ కంపెనీలు ఓ మెట్టు దిగి వచ్చాయి. ధరలు తగ్గించాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ విజ్ఞప్తి మేరకు సిమెంట్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. పోలవరం, పేదల ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో ఒక్కో బస్తా మీద 145 రూపాయలని సిమెంట్ కంపెనీలు తగ్గించాయి. గడిచిన ఐదేళ్ళలో బస్తా 380 ఉంటే ఇప్పుడు 235 రూపాయలకి ఇవ్వడానికి సిమెంట్ కంపెనీలు అంగీకరించాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో వివిధ కంపెనీల యజమానులు, ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు చేపడుతున్న పనులకోసం ఈ ఏడాది అవసరమైన సిమెంటు వివరాలను కంపెనీ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖకు 40 లక్షల మెట్రిక్‌ టన్నులు, పంచాయతీరాజ్‌ శాఖ 25లక్షల మెట్రిక్‌ టన్నులు, జలవనరుల శాఖ 16.57 లక్షల మెట్రిక్‌ టన్నులు, మున్సిపల్‌శాఖ 14.93 మెట్రిక్‌ టన్నులు... తదితర శాఖలు కలిపి మొత్తంగా 1,19,43,237 మెట్రిక్‌ టన్నుల అవసరాలు ఉంటాయని వివరాలు తెలిపారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు అని, అలాగే పేదలందరికీ ఇళ్లనిర్మాణం రూపేణా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. సిమెంటు ఉత్పత్తి, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.