కేఫ్ కాఫీ డే కంపెనీలో లెక్కతేలని రూ.2,000 కోట్లు..!

post

కేఫ్  కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కేఫ్ కాఫీ డే బోర్డు దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా.. సంస్థ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా.. రూ.2000 కోట్లు లెక్క తేలలేదని, అదృశ్యమైనట్లు తెలిసిందని బ్లూమ్‌బర్గ్  వెల్లడించింది. సిద్ధార్థకు చెందిన ఇతర ప్రైవేట్ కంపెనీలతో కేఫ్ కాఫీ డే బ్యాంకు ఖాతాల నుంచి జరిపిన లావాదేవీలను పరిశీలించగా ఈ విషయం తేలింది.సిద్ధార్థ జరిపిన లావాదేవీలను పరిశీలించిన కాఫీ డే బోర్డు 100 పేజీలకు పైగా డ్రాఫ్ట్ రిపోర్ట్‌‌ను రూపొందించినట్లు తెలిసింది. ఈ నివేదికను త్వరలో బయటపెట్టనున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. దర్యాప్తు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని.. కొనసాగుతోందని కంపెనీకి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ నివేదిక తుదిదశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ డబ్బంతా ఏమైందనే దానిపై పూర్తినివేదిక వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని సదరు వ్యక్తులు చెబుతున్నారు.
            గతేడాది జులై 29న అదృశ్యమైన సిద్ధార్థ రెండు రోజుల తర్వాత జులై 31న నేత్రావతి నదిలో శవమై కన్పించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మరణించడానికి సిద్ధార్థ తన బోర్డు సభ్యులు, ఉద్యోగులకు రాసిన లేఖ ఒకటి ఆ తర్వాత బయటకొచ్చింది. అప్పుల బాధ, పన్ను అధికారులు, రుణదాతల ఒత్తిడి వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ లేఖలో ఉంది. అంతేగాక, కంపెనీ ఆర్థిక లావాదేవీలకు పూర్తి బాధ్యత తనదేనని సిద్ధార్థ ఆ లేఖలో రాశారు. ఈ లేఖ కాస్తా వివాదాస్పదంగా మారడంతో దానిపై కాఫే డే బోర్డు దర్యాప్తు జరిపింది.