రైతుల పాలిట వరం.."కిసాన్ క్రెడిట్ కార్డు"..!

post

క్రెడిట్ కార్డు..ఈమధ్య చాల మంది ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఇదే ఆపన్న హస్తం. జీతాలు సరిపోకపోయినా, వ్యాపారం లో ఇన్వెస్ట్మెంట్ కావాలన్న క్రెడిట్ కార్డులు దిక్కు. అప్పు తీసుకుని, ఈఎంఐ ల ద్వారా నెలకింతని కట్టుకుంటూ అవసరాలు గడుపుకుంటారు. అతి గా వాడటం ప్రమాదమే అయినా, ఉన్నంత లో సర్దుకుంటూ వాడేవారికి, మధ్య తరగతి వారికి క్రెడిట్ కార్డు ఓ వరమే. అయితే, క్రెడిట్ కార్డుకు అర్హత వచ్చాకే, అంటే.. మన నెల జీతాలు, బ్యాంకు లావాదేవీలు ఇవన్నీ చెక్ చేసిన తరువాతే మనకు క్రెడిట్ కార్డు ఇస్తారు. మరి రైతులకు ఇది ఇంకా దూరం గానే ఉంది. అందుకే, కేంద్ర ప్రభుత్వం సరికొత్త పధకానికి తెర లేపింది.

       రైతులకు రుణాలు తీసుకునేందుకు వీలుగా "కిసాన్ క్రెడిట్ కార్డు" ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిద్వారా రెండెకరాల పొలం వున్నవారు రెండు లక్షల వరకు, అంతకుమించి ఉన్నవారు మూడు లక్షల వరకు ఋణం తీసుకునేలా ఈ కార్డు సాయం చేస్తుంది. సొంతం గా భూమి ఉండి, పద్దెనిమిది నుంచి 70 ఏండ్ల లోపు వయసున్న రైతులెవరైనా ఏదైనా ప్రైవేట్ లేదా గవర్నమెంట్ బ్యాంకు నుంచి ఈ కార్డు ను పొందవచ్చు. మీసేవ కేంద్రాల వద్ద కూడా "కిసాన్ క్రెడిట్ కార్డు"ల దరఖాస్తు లు లభిస్తాయి. కిసాన్ క్రెడిట్ కార్డుతో విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, ఇతర పరికరాలను కొనుగోలు చేయవచ్చు. 45రోజుల్లో చెల్లించిన వారికి వడ్డీ కూడా ఉండదు. కార్డు ఉన్న వాళ్లందరికీ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని కూడా అమలు చేయనున్నారు.