మార్చి 16 నుంచి డొమెస్టిక్ లావాదేవీలే...ఆన్ లైన్ సేవలు బంద్..!

post

డెబిట్ , క్రెడిట్ కార్డుల వినియోగం పై రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా దృష్టి సారించింది. ఆన్ లైన్ మోసాలు పెరగపోవడంతో వీటి వినియోగానికి సంబందించి అన్ని బ్యాంకులకు నిభందనలను జారీ చేసింది. మార్చి 16 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో  కేవలం డొమెస్టిక్‌ లావాదేవీలు చేసేందుకు మాత్రమే వీలుంది. అంటే ఏటీఎం, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌)టెర్మినల్స్‌లో మాత్రమే వాడుకోవచ్చు.ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీలు చేయాలనుకుంటే బ్యాంకు నుంచి అనుమతి పొందాల్సిందే. ఇకపై జారీ చేసే కొత్త కార్డులు, కాల పరిమితి ముగిసిన కార్డులను రెన్యువల్‌ చేసుకున్నప్పుడు ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది.
ప్రస్తుతం ఉన్న కార్డుల్లో ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీలను డీయాక్టివేట్‌ చేసే అధికారం బ్యాంకులకు ఉంది. ఇంతకు ముందు తీసుకున్న కార్డుల ద్వారా ఇప్పటి వరకు ఆన్‌లైన్‌, అంతర్జాతీయ, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలు చేయకపోయినా బ్యాంకులు ఆ సదుపాయాలను డీయాక్టివేట్‌ చేస్తాయి. ఇకపై వినియోగదారులు తమ కార్డులను సంబంధిత ఏటీఎంల ద్వారా స్విచ్‌ ఆఫ్/ఆన్‌ చేసుకోవచ్చు. ఎటువంటి లావాదేవీలు చేయనప్పుడు ఈ సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే భారతీయ స్టేట్‌బ్యాంకు చాలామంది వినియోగదారులకు  సందేశాలు పంపించింది.