ఆ ఏడు దేశాలనుంచి వస్తే నేరుగా వికారాబాద్ కే..!

post

దేశంలో కోవిడ్‌ వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియా  దేశాల నుంచి హైదరాబాద్ ఎవరొచ్చినా, వారికి కోవిడ్‌ లక్షణాలు ఉన్నా లేకున్నా ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచాలని శుక్రవారం నిర్ణయించింది. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నడిచే హరిత వ్యాలీ వ్యూ రిసార్ట్‌కు తరలించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు.. వారిని 14 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వారికి వైరస్‌ లేదని నిర్ధారణ అయ్యాక ఇళ్లకు పంపించునున్నారు. ఒకవేళ ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలుంటే  వెంటనే వారిని  గాంధీ,ఫీవర్‌, ఛాతీ ఆసుపత్రులకు  చికిత్స కోసం తరలిస్తారు..ఒకవేళ ఈ దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరిగినా, ఇతర దేశాల నుంచి వచ్చే వారిలో ఎవరికైనా అనుమానిత లక్షణాలున్నా వారిని ఐసొలేషన్‌లో ఉంచే విషయంలో సర్కారు అనేక ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది. 

 హైదరాబాద్‌ పరిసరాల్లో అటవీ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన శిక్షణ కేంద్రాలను కూడా ప్రత్యేక వార్డులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరీ అవసరమైతే ఇప్పటికే పూర్తయిన దాదాపు 40 వేల డబుల్‌ బెడ్రూం ఇళ్లను కూడా వాడుకొనేలా ఏర్పాట్లు చేయాలనుకుంటోందిఇందుకు అవసరమైన వైద్యులు, నర్సులు, ఇతర సహాయక సిబ్బందిని, ఔషధాలు, పరికరాలను యుద్ధప్రాతిపదికన సమకూర్చాలని అధికారులను ఆదేశించింది. . శుక్రవారమే 17 మంది విమాన ప్రయాణికులను ప్రత్యేక వాహనంలో హరిత రిసార్ట్‌కు తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు అనంతగిరి ప్రాంతంలో ప్రత్యేక ఐసొలేషన్‌ ఏర్పాటుపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పర్యాటక కేంద్రమైన అనంతగిరిలో ఐసొలేషన్‌ కేంద్రం వల్ల స్థానికంగా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందంటూ పలువురు హరిత రిసార్ట్‌ వద్ద నిరసన చేపట్టారు.