నా భూమినే కబ్జా చేసారు. - కన్నా లక్ష్మీనారాయణ

post

రాష్ట్ర పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించాక అక్కడ భూ కబ్జాలు భారీ పెరిగిపోయానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సాక్షాత్తూ విశాఖలో తన భూమినే కబ్జా చేశారని వాపోయారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఏర్పాడ్డాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో భూముల యజమానులు తీవ్రంగా భయపడుతున్నారని, తమ పార్టీ కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తుపాకీ గురిపెట్టి మరీ సెటిల్‌మెంట్లు చేస్తున్నారని లక్ష్మీనారాయణ మండిపడ్డారు.
       1993లో చేపలుప్పాడలో తాను స్థలం కొనుగోలు చేశానని, పక్కనే ఓ పోలీసు అధికారి కూడా స్థలం కొనుగోలు చేశారని చెప్పారు. అయితే ఓ రోజు ఆ పోలీసు అధికారి తనకు ఫోన్ చేసి.. తమ ఇద్దరి భూములు కబ్జా చేశారని చెప్పినట్లు వివరించారు. దీంతో వెంటనే తన మనుషులను పంపించి తన భూమి చుట్టూ వేసిన కంచెను తొలగించారని గుర్తు చేసుకున్నారు. అదేంటని అడిగితే ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థలం అని అనుకోలేదని కబ్జాదారులు చెప్పారని వ్యాఖ్యానించారు.తన మాదిరిగానే విశాఖలో భూ మాఫియాకు వందలాది మంది బాధితులయ్యారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.