వివేకా కేసు సీబీఐ కు..!

post

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ వీడనుందా...ఈ కేసు దర్యాప్తును  సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు నిర్ణయించిన నేపధ్యంలో ఘటనకు సంబంధించిన అసలు నిజాలు వెలికి వస్తాయా...   వివేకానందరెడ్డి. హత్య జరిగి ఏడాది కావస్తున్నా ఇంతవరకూ ఎలాంటి సాక్ష్యాధారాలు లభ్యం కాకపోవడం, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల  హై కోర్డు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. . కేసు మిస్టరీని చేధించటానికి సీబీఐ దర్యాప్తు సరైనదేనంటూ తేల్చి చెప్పేసింది.
     రాజకీయ కారణాల వల్ల ఈ హత్య జరిగిందా? ఆస్తి తగాదాల వల్ల జరిగిందా? భూ తగాదాల వల్ల జరిగిందా? మరే ఇతర కారణాల వల్ల జరిగిందనేది పోలీసులు ఇప్పటివరకూ తేల్చలేకపోయారు. ఈ హత్య కేవలం రాష్ట్రానికి సంబంధించినదని భావించలేమన్న కోర్టు. వివేకాకు ఉన్న రాజకీయ నేపథ్యం వల్ల ఆయన హత్య కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదని తెలిపింది.  వివిధ కోణాలున్న ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటకు రావడానికి అవకాశం ఉందని అభిప్రాయపడిన హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. సీబీఐ సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ ఫైల్‌ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర పోలీసులు రికార్డులన్నీ వెంటనే సీబీఐకి అప్పగించి, దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది.2019 మార్చి 15వ తేదీన వైఎస్‌ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. కేసు దర్యాప్తు కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ సిట్‌  ఏర్పాటు చేసింది. అయితే పోలీసుల దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని, టీడీపీ ప్రభుత్వం కేసును పక్కదోవ పట్టించే అవకాశమున్నందున ఆ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ అదే నెల 19వ తేదీన వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, నాటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో హత్యకేసులో అసలు దోషుల్ని వదిలేసి అమాయకుల్ని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందువల్ల కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి గత డిసెంబరు 11వ తేదీన, మాజీ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి డిసెంబరు 30వ తేదీన పిటిషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, కేసును సీబీఐకి ఇవ్వాలంటూ వివేకా కుమార్తె ఎన్‌.సునీతా, అల్లుడు ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి సంయుక్తంగా గత జనవరి 24వ తేదీన పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో 15 మంది వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశారు.