ఏపీ రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో కొత్త రచ్చ..!

post

ఏపీ లో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవలే, ఏపీ సీఎం మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు పారిశ్రామికవేత్త, రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి తో పాటుగా, రిలయన్స్ సామ్రాజ్యపు కీలక వ్యక్తి పరిమళ్ నత్వాని ని కూడా కలుపుకుని నలుగురు వ్యక్తులను ఏపీ ప్రభత్వం తరపున రాజ్యసభ కు పంపిస్తున్నట్లు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి అనూహ్యం గా బ్రేక్ పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నుండి వర్ల రామయ్య రాజ్యసభ అభ్యర్ధిగా బరిలో నిలుస్తారని ప్రకటించారు. దీనితో ఇపుడు ఎన్నికలు తప్పనిసరి అవుతున్నాయి.

జగన్ కు వర్లరామయ్య సవాల్..!

చంద్రబాబు రాజ్య సభ అభ్యర్థి గా వర్ల రామయ్య బరిలో నిలుస్తారన్న ప్రకటన వెలువడిన నేపధ్యం లో, వర్ల రామయ్య జగన్ కు సవాల్ విసిరారు. నలుగురు రాజ్య సభ అభ్యర్థుల లిస్ట్ లో పరిమళ్ నత్వాని ని చేర్చడం పట్ల ఆయన ఆగ్రహము వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ లోంచి ఒకరిని పక్కన పెట్టి మరీ నత్వానికి రాజ్య సభ లో చోటు చేసిన సంగతి తెలిసిందే. 'నత్వానికి బదులు గా ఓ దళితున్ని పంపాలి. వైసీపీ లో ఉన్న నాయకత్వానికి నేను సవాలు చేస్తున్నా. నేను పోటీ నుంచి తప్పుకుంటాను. నేను నా పార్టీని ఒప్పిస్తాను. 13వ తారీఖు దాకా సమయం ఉంది. దళితులను పోటీకి పెడితే నేను విత్‌ డ్రా అవుతాను. దళిత నేతలు ఈ విషయంపై జగన్‌ను ఒప్పించండి. లేదంటే వైసీపీ నాయకులు నాకు ఓటేయండి. అంబేద్కర్‌ వాణి పార్లమెంటులో వినపడాలంటే నేనొక్కడినే ఉన్నాను' అని ఆయన చెప్పుకొచ్చారు.

పరిమళ్ నత్వానికి వైసిపి కండువా..!

ఇది ఇలా ఉంటే, మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి పరిమళ్ నత్వాని కు పార్టీ కండువా కప్పడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశం ఐంది. ఇప్పటివరకు పరిమళ్ వైసీపీ పార్టీ మద్దతు తో రాజ్యసభ లో స్వతంత్ర అభ్యర్థి గా మాత్రమే కొనసాగుతారని ప్రచారం జరిగింది. నామినేషన్ వేస్తున్న సమయం లో, సీఎం జగన్ పరిమళ్ కు నామినేషన్ ఇవ్వడం తో పాటుగా పార్టీ కండువా కప్పి, ఆయన వైసిపి సభ్యునిగా తానే ఫిక్స్ చేసేసారు. దీనితో నత్వాని సైతం ఇక జగన్ కు వత్తాసు పలకాల్సిందేనా..? అని పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. పార్టీ అధినేతగా ఉన్న జగన్ వ్యూహాత్మకంగానే వేసి..పైకి చెప్పకపోయినా ఆయన్ను వైసీపీలో చేరినట్లుగా ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. మొదట, స్వతంత్ర అభ్యర్థిగా నత్వాని కొనసాగుతారన్న వార్తలు వచ్చినా, జగన్ కండువా కప్పడం తో,  ఆయన అధికారికంగా వైసీపీ అభ్యర్ధిగానే పెద్దల సభలో కాలు పెడుతున్నారా అన్న సందేహం మొదలవుతోంది. ఒకవేళ, ఇదే నిజమైతే పరిమళ నత్వాన్ని సీఎం జగన్ కోసం కీలక భూమిక పోషించాల్సి ఉంటుంది.